ఓటెత్తారు..సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గొడవలు, వాగ్వాదాలు

ఓటెత్తారు..సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గొడవలు, వాగ్వాదాలు
  • ఉమ్మడి మెదక్​ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 403 వార్డుల్లో పోలింగ్​ ప్రశాంతం
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు, ఎన్నికల అధికారులు

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ ​జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహాయించి మున్సిపల్​ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 76.01 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో11 మున్సిపాలిటీల్లో 256 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డి మునిసిపాలిటీలో 70.06 శాతం పోలింగ్ నమోదు కాగా, సదాశివపేటలో 78.82, జహీరాబాద్ లో 72.04, కోహిర్ లో 75.36, నారాయణఖేడ్ లో 72.64, అందోల్-జోగిపేటలో 79.04, ఇస్నాపూర్ లో 80.55, ఇంద్రేశంలో 84.84, గడ్డపోతారంలో 86.08, జిన్నారంలో 90.98, గుమ్మడిదల మున్సిపాలిటీలలో 81.56 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. అందోల్-జోగిపేట లో మంత్రి దామోదర సదాశివపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఓటు వేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ఘటనలు

సంగారెడ్డిలోని 30వ వార్డులో ఇండిపెండెంట్ క్యాండిడేట్ నవత్ నాగరాజు డబ్బులు పంచుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పోలీసులను చూసి అతను బాత్రూంలో దాక్కోగా కుటుంబ సభ్యులు తాళం వేసి తప్పించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు గందరగోళం నెలకొనగా చివరకు నాగరాజును పోలీసులు బయటకు రప్పించి అరెస్టు చేశారు.

సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో  కాంగ్రెస్ అభ్యర్థి ఆడ్డును సంగారెడ్డి టౌన్ సీఐ శివకుమార్ గళ్ల పట్టి బయటకు నెట్టి వేయడంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొడవకు దిగారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న ఎన్నికల కమిషన్ జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ కు సూచించింది. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట:జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో  మొత్తం 82.03 శాతం పోలింగ్​నమోదైంది. దుబ్బాకలో 85.05, హుస్నాబాద్ లో 84.21, చేర్యాలలో 83.41, గజ్వేల్లో 79.35 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగినా తర్వాత పుంజుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,01,085  ఓటర్లకు 82,921  మంది ఓటు హక్కును వినియోగించుకోగా పురుషులు 40,380, మహిళలు 42,553  మంది ఉన్నారు.

మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే 2173  మంది అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా దుబ్బాకలో 85.05 శాతం ఓటింగ్​నమోదు కాగా అత్యల్పంగా గజ్వేల్ మున్సిపాలిటీలో  79.35 శాతం నమోదైంది. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాల్ ఎన్నికల తీరును పరిశీలించారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ హైస్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, గజ్వేల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేర్యాల మున్సిపాలిటీ ఏడో వార్డులో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు, 4వ వార్డులో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో 8 వ వార్డుకు చెందిన కార్తీక్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 మెదక్ జిల్లాలో..

మెదక్ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 81.09 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి మహిళా ఓటర్లు 44,591 మంది ఉండగా 36,015 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 41,516 మంది ఉండగా 33,806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా రామాయంపేట మున్సిపాలిటీలో 84.84 శాతం పోలింగ్​నమోదైంది.

ఉదయం ఏడు గంటలకే పోలింగ్​ మొదలు కాగా చలి తీవ్రత ఉండడంతో మొదటి గంట పోలింగ్ మందకొడిగా సాగింది. 8 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం పెరిగింది. కలెక్టర్​ రాహుల్​ రాజ్​ పట్టణంలోని 18వ వార్డు పరిధి గాంధీనగర్​ పోలింగ్​స్టేషన్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అడిషనల్​ కలెక్టర్ నగేశ్, అడిషనల్​ఎస్పీ మహేందర్​ పట్టణంలోని 5వ వార్డులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎలక్షన్​అబ్జర్వర్​ రవికిరణ్​ మెదక్, తూప్రాన్​పట్టణాల్లో పోలింగ్​తీరును 
పరిశీలించారు.