హైదరాబాద్, వెలుగు: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల14వ తేదీ నుంచి16వ తేదీ వరకు మూడ్రోజులపాటు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 208 బస్సులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రం నుంచి అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 781 బస్సులను కేటాయించారు. ఆ తర్వాత వేములవాడకు 416, కీసరగుట్టకు 326, ఏడుపాయలకు 249, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులను నడపనున్నారు. వీటితోపాటు కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి.
ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ
శివరాత్రి స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే వారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం (1.5 రెట్లు) ఎక్కువగా వసూలు చేయనున్నారు. అయితే, రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత చార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఏడుపాయలకు వెళ్లే బస్సుల్లో మాత్రం 15 నుంచి 17వ తేదీ వరకు ఈ పెంచిన చార్జీలు అమల్లో ఉంటాయి.
కాగా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్పెషల్బస్సుల్లోనూ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పేర్కొన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు జీరో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీశైలం వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్సదుపాయం కల్పించారు. www.tgsrtcbus.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 040-–69440000, 040-–23450033 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
