ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
  • ఉమ్మడి జిల్లాలో ఎక్కడా 80 శాతం దాటని పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
  • అత్యధికంగా ఆసిఫాబాద్​లో 77.67 శాతం ఓటింగ్
  • ఆదిలాబాద్​లో డబ్బులు పంచుతున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు 
  • ఓ పోలింగ్ కేంద్రంలో మహిళ వద్ద కత్తి లభ్యం

ఆదిలాబాద్, నెట్​వర్క్, వెలుగు:  మున్సిపల్​ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్​తోపాటు పది మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్​జరిగింది. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్​తో పాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లోని 149 వార్డుల్లో 444 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. మధ్యాహ్నం తర్వాత సెంటర్ల వద్ద రష్ కనిపించింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాలకు అధికారులు తాళం వేయగా.. అప్పటికే లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కలెక్టర్లు, పోలీస్​అధికారులను పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. డ్రోన్ ద్వారా పోలింగ్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. 

ఆదిలాబాద్ ​మున్సిపాలిటీలో..

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు పోలింగ్ జరగ్గా 69.04 పోలింగ్ శాతం నమోదైంది. 70.55 శాతం పురుషులు, 67.62 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళ ఓటు శాతం భారీగా తగ్గింది. మొత్తం 73,836 మంది మహిళా ఓటర్లు ఉండగా 49,926 మంది మాత్రమే ఓటు వేశారు. ఆదిలాబాద్​లోని రాంనగర్ పోలింగ్ కేంద్రంలో ఓ మహిళను పోలీసులు తనిఖీలు చేయగా ఆమె బ్యాగులో చిన్న కత్తి లభ్యమైంది.

దీంతో పోలీసులు ఆమెను మావల పోలీస్ స్టేషన్​కు తరలించారు. మతం పేరుతో వాట్సాప్ లో ఎన్నికలపై ప్రచారం చేసిన చంద్రశేఖర్ అనే వ్యక్తిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహాలక్ష్మి వాడలో ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు అరటిపళ్లు పంచుతూ ప్రలోభపెడుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ పై, పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచుతున్న కాటిపెల్లి రాజారెడ్డి, కృష్ణకుమార్​పై కేసు నమోదు చేశారు. 

నిర్మల్​ జిల్లాలో..

నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు, భైంసాలో 26 వార్డులు, ఖానాపూర్​లో 12 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భైంసా మొత్తం 51,118 మంది ఓటర్ల కు గాను 32,054 మంది, ఖానాపూర్ లో 17,693 మంది ఓటర్లకు గాను 13,240 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరిలో నుండి మహిళలు 7,228 మంది, పురుషులు 6,012 మంది ఉన్నారు. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో దాదాపు వేయి మంది పోలీస్ సిబ్బంది మూడు మున్సిపాలిటీల పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఓటుకు పోటెత్తిన ఆసిఫాబాద్

ఆసిఫాబాద్, కాగజ్​నగర్ పట్టణ వాసులు ఓటేసేందుకు పోటెత్తారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు ఎన్నికల జరగ్గా ఓటు వేసేందుకు కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో మొత్తం ఓట్లు 13927  ఉండగా 10817 పోలైయ్యాయి. పోలింగ్  77.67 శాతం నమోదైంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ లో మొత్తం 51205  ఓట్లు ఉండగా 32,937 ఓట్లు పోలవగా 64.32 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్​అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఈ నెల 13న ఫలితాలు విడుదల కానున్నాయి.