ZIM vs NZ: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 66 ఏళ్ల తర్వాత సీన్ విలియమ్స్ అరుదైన ఘనత

ZIM vs NZ: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 66 ఏళ్ల తర్వాత సీన్ విలియమ్స్ అరుదైన ఘనత

జింబాబ్వే బ్యాటింగ్ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ టెస్ట్ క్రికెట్‌లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తన జట్టుకు అత్యంత నిలకడగా బ్యాటర్ గా నిలిచి ఒక ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో డకౌట్ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. వరుసగా 45 ఇన్నింగ్స్ ల్లో డకౌట్ కాకుండా టెస్ట్ క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. 

ఆస్ట్రేలియాకు చెందిన జిమ్ బర్క్ 66 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి టాప్ లోకి దూసుకొచ్చాడు. ఈ ఆసీస్ ప్లేయర్ 44 మ్యాచ్ ల్లో డకౌట్ కాకుండా కాలేదు. విలియమ్స్ ఇప్పటివరకు 23 టెస్టులు ఆడాడు. 48 యావరేజ్ 1900 పరుగులు చేశాడు. వీటిలో ఆరు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన టెస్ట్ కెరీర్ లో విలియమ్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. ఇండియా తరపున ఈ రికార్డ్ బ్రిజేష్ పటేల్ పేరిట ఉంది. బ్రిజేష్ తన టెస్ట్ కెరీర్‌లో 38 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ.. ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

టెస్ట్ కెరీర్‌లో డకౌట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లు

సీన్ విలియమ్స్ (జింబాబ్వే) -45

జిమ్ బర్క్ (ఆస్ట్రేలియా) -44

రెగ్గీ డఫ్ (ఆస్ట్రేలియా) -40

బ్రిజేష్ పటేల్ (భారతదేశం) -38

రాబర్ట్ క్రిస్టియానీ (వెస్టిండీస్) -37 

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కేవలం 149 పరుగులకే ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 307 పరుగులు చేసింది. దీంతో కివీస్ కు తొలి ఇన్నింగ్స్ లో   158 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ప్రస్తుతం 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఆరు పరుగుల ఆధిక్యంలో నిలిచింది.