18 మంది ప్రాణాలు తీసిన సంచి మూట..ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట గురించి వెలుగులోకి షాకింగ్ నిజం

18 మంది ప్రాణాలు తీసిన సంచి మూట..ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట గురించి వెలుగులోకి షాకింగ్ నిజం

న్యూఢిల్లీ: 2025, ఫిబ్రవరి 15వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ హైలెవల్ కమిటీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు గల కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు సంబంధించి హైలెవల్ కమిటీ సమర్పించిన రిపోర్టులోని అంశాలను  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రివీల్ చేశారు. 

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం (ఆగస్ట్ 1) ఆయన రాజ్య సభలో మాట్లాడుతూ.. 2025, ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 8:48 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. మహా కుంభమేళా‎ వెళ్లే రైలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని.. ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయిందని చెప్పారు. ఈ సమయంలో రద్దీగా ఉన్న మెట్ల మార్గంలో ఓ ప్రయాణికుడు తల పై నుంచి బరువైన వస్తువు కిందపడటంతో గందరగోళం మొదలై చివరకు తొక్కిసలాటకు దారి తీసిందని వివరించారు. 

తొక్కిసలాట 14, 15 ఫ్లాట్‎ఫామ్‎ల మధ్య జరిగిందని.. స్టేషన్ అంతటా జరగలేదని క్లారిటీ ఇచ్చారు. వెంటనే రైల్వే సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహయక చర్యలు చేపట్టాయని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి అండగా నిలిచిందని గుర్తు  చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.