స్పీడ్ గవర్నర్స్ డివైజ్లు ఎక్కడ ? రాష్ట్రంలో 75 శాతం వాహనాలకు లేవు..

స్పీడ్ గవర్నర్స్ డివైజ్లు ఎక్కడ ? రాష్ట్రంలో 75 శాతం వాహనాలకు లేవు..
  • ఓవర్ స్పీడ్తో దూసుకుపోతున్న వాహనదారులు
  • చూసీచూడనట్టు ఉంటున్న అధికారులు
  • ఫలితంగా రోడ్డు ప్రమాదాలు.. మరణాలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం వాహనాల ఓవర్​స్పీడ్తో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. స్పీడ్ నియంత్రణ విషయంలో ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణా వాహనాలు, స్కూల్​ వ్యాన్​లు, కాలేజీ బస్సుల ఓవర్​ స్పీడ్​ను నియంత్రించడానికి తప్పనిసరిగా స్పీడ్​ గవర్నర్స్​ డివైజ్​ను అమర్చాల్సి ఉండగా, ఎక్కడా అమలు కావడం లేదు. 

ఈ డివైజ్ ద్వారా వాహనం స్పీడ్​ను కంట్రోల్​ చేయొచ్చు. గ్రేటర్​ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం వాహనాలకు స్పీడ్​గవర్నర్​ డివైజ్​ లేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదం తర్వాత బస్సులు, టిప్పర్లు, ట్యాంకర్లు, స్కూల్​, కాలేజీ బస్సులు, వ్యాన్​లకు తప్పని సరిగా స్పీడ్​ గవర్నర్స్​ డివైజ్​అమర్చడానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే, శివారు ప్రాంతాల్లోనూ, హైవేలపై వెళ్లే వాహనాలకు ఈ డివైజ్​లు ఉన్నాయో లేవో చెక్​చేస్తున్నారు.

కేంద్ర మోటార్​ వాహన చట్టం ఏం చెబుతోందంటే..
గ్రేటర్​ మాత్రమే కాకుండా శివారు ప్రాంతాలు, హైవేలపై ప్రయాణిస్తున్న రవాణా వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్​గవర్నర్​ డివైజ్ ఉండాల్సిందేనని సెంట్రల్​ మోటార్​ వెహికల్​ యాక్ట్​-1989, రూల్​118  స్పష్టం చేస్తోంది. 2015, నవంబరు,9న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్​చేసిన నోటిఫికేషన్​లోనూ దీన్ని తప్పనిసరి చేసింది. 

వాహనాల తయారీదారులే వాహనాలకు డివైజ్​లు అమర్చాలని చెప్పింది. తయారీ టైంలో అమర్చక పోతే డీలర్లు అమర్చాలని సూచించింది. భారీ వాహనాల లిమిట్​ను 80 కి.మీగా సెట్​ చేయాలని పేర్కొన్నది. ఇందులో టూవీలర్స్​, ప్యాసింజర్​ ఆటోలు, ఫైర్​ సర్వీస్​ వాహనాలు, అంబులెన్స్​, పోలీస్​ వాహనాలకు మినహాయింపును ఇచ్చింది. మిగిలిన ట్రాన్స్​పోర్ట్​​ వాహనాలు ముఖ్యంగా బస్సులు, డంపర్​ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్​బస్సులు, కాలేజీ బస్సులు, టిప్పర్లు 60 కి.మీ దాటకుండా చూడాలని పేర్కొంది. 

ఆదేశాలు లైట్​ తీస్కున్నరు
తయారీదారులు కానీ, డీలర్లు కానీ యాక్ట్​ను గాని, రాష్ట్ర ప్రభుత్వ జీవోను గాని పట్టించుకోవడం లేదు. నగర రోడ్లపైనే కాకుండా హైవేలపై కూడా విపరీతమైన వేగంతో వెళ్తున్నారు. భారీ వాహనాలు ముఖ్యంగా సరుకుల్ని, మనుషులతో ప్రయాణించే వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా స్పీడ్​ లిమిట్​ పాటించడం లేదు. కొన్ని ప్రైవేట్​ బస్సుల నిర్వాహకులైతే త్వరగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుండడంతో వారు వందకు పైగా స్పీడ్​తో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సరుకు రవాణా, స్కూల్​ వ్యాన్లు, బస్లు నిర్ధేశిత వేగం కంటే ఎక్కువ వేగంతో నడుపుతున్నారు. 

డివైజ్లు అమర్చుకోవాలని చెప్తున్నం  
బస్సులు, ట్రక్కులు, రవాణా వాహనాలు స్పీడ్​గవర్నర్స్​డివైజ్లు అమర్చుకోవాలని యజమానులకు చెప్తున్నం. బస్సులు, ఇతర వాహనాల ఫిట్​నెస్​ కూడా తనిఖీ చేస్తున్నాం. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటాం.

రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్