- సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఈబీసీ జాతీయ అధ్యక్షుడు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నత వర్గాల్లోని పేదల కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సెక్రటేరియెట్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అగ్రకులాల్లోనూ 80 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేని స్థితిలో ఉన్నాయని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సాయం అందక ఈబీసీలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందుతున్న విధంగానే ఈబీసీలకూ సంక్షేమ పథకాలు అందేలా విధివిధానాల్లో మార్పులు చేయాలని కోరారు. ఈబీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.ఐదు కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని, ఈబీసీ కమిషన్, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏర్పాటు చేసిన విధంగానే ఈబీసీ స్టూడెంట్స్‌కు స్టడీ సర్కిల్స్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్ఇవ్వాలని, స్కాలర్‌షిప్‌లతోపాటు మెస్‌చార్జీలు అందేలా చూడాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి సడలింపు, అర్హతల్లో మార్పులను ఈబీసీలకూ వర్తింపజేయాలన్నారు.
