
విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై స్మూత్‌గా ల్యాండ్ కాలేకపోయింది. ఇది ఫెయిల్యూర్ కాదని సైంటిస్టులు అంటున్నారు. అసలు, ఫెయిల్యూర్ అనే మాట గురించి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారు?
1979లో మనదేశ తొలి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్వీ3) ప్రయోగం జరిగింది. అది కక్ష్యలోకి చేరలేదు. అప్పుడు ఆ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అబ్దుల్ కలాం.. ఇస్రో చైర్మన్‌గా ప్రొఫెసర్ సతీశ్ ధావన్ ఉన్నారు.
2013లో ఆ ప్రయోగం గురించి అబ్దుల్ కలాం మాట్లాడుతూ వైఫల్యాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పారు. ‘‘అది 1979. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్. శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ పై ఎస్ఎల్వీ3 ఉంది. కౌంట్ డౌన్ మొదలైంది. సడన్‌గా కంప్యూటర్ కౌంట్‌డౌన్‌ను ఆపేసింది. నేను మిషన్ డైరెక్టర్ ని. ఏదో ఒక నిర్ణయం నేనే తీసుకోవాలి. నిపుణులంతా ముందుకే వెళ్లాలన్నారు. నేను కంప్యూటర్‌ను బైపాస్ చేసి.. రాకెట్‌ను లాంచ్ చేశాను. రెండో స్టేజ్ అదుపు తప్పింది. పల్టీలు కొట్టింది. రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. కంప్యూటర్ వార్నింగ్ ఇచ్చినా రాకెట్‌ను లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకుంది నేనే. తొలిసారి ఓడిపోయా. సక్సెస్‌ను మేనేజ్ చేయగలను. కానీ ఓటమిని ఎలా..? విమర్శలు వస్తాయని తెలిసినా ఇస్రో చైర్మన్ సతీశ్ ధావన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ‘‘డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఫెయిల్ అయ్యాం. నేను మా టెక్నాలజిస్టులు, సైంటిస్టులు, స్టాఫ్‌కు పూర్తి మద్దతునిస్తున్నా. వచ్చే ఏడాది వారు సక్సెస్ అవుతారు” అని సతీశ్ ధావన్ చెప్పారు. మొత్తం తప్పును తనపై వేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది 1980 జులై 18న మా టీమ్ రోహిణి ఆర్ఎస్1ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించింది. అప్పుడు సతీశ్‌ధావన్ నన్ను పిలిచి మీడియాతో మాట్లాడాలన్నారు. ఓటమి ఎదురైనప్పుడు ఒక ఆర్గనైజేషన్ లీడర్ దానికి పూర్తి బాధ్యతను తీసుకోవాలి. అదే సక్సెస్ వచ్చినప్పుడు అతడు దానిని తన టీమ్ మొత్తానికి ఇవ్వాలి. దీనిని నేను పుస్తకాల్లో చదివి నేర్చుకోలేదు. అనుభవపూర్వకంగా వచ్చింది’’ అని కలాం చెప్పారు.