ఏప్రిల్ వచ్చినా అభయహస్తం పైసలు రాకపాయే

ఏప్రిల్ వచ్చినా అభయహస్తం పైసలు రాకపాయే

మంచిర్యాల, వెలుగు: ‘అభయహస్తం పైసలు వాపస్ ఇస్తాం..మార్చి 31లోగా వడ్డీతో సహా మీ అకౌంట్లలో జమ చేస్తాం’ అన్న ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్​రావు హామీ నెరవేరలేదు. మంత్రి చెప్పిన మార్చి పోయి ఏప్రిల్ వచ్చినా పైసలు రాకపోవడంతో అభయహస్తం లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. మార్చి 4న మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు బెల్లంపల్లిలో స్వశక్తి మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు. ఆ సందర్భంగా మహిళా సంఘాలకు పెండింగ్ ఉన్న వడ్డీ మాఫీ డబ్బులతో పాటు.. అభయహస్తం లబ్ధిదారులకు వారు కట్టిన మొత్తాన్ని వడ్డీతో సహా మార్చి 31లోగా  అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అభయహస్తంలో ప్రతి నెలా  పైసలు కడితేనే రూ.500 పింఛన్ వచ్చేదని, సీఎం కేసీఆర్ పైసా కట్టించుకోకుండానే నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తున్నాడన్నారు. పైగా వయోపరిమితిని 57 ఏండ్లకే తగ్గించాడని చెప్పారు. ఇక అభయహస్తంతో పనిలేదని, అందుకే ఎవరి పైసలు వాళ్లకు వాపస్ ఇస్తామని ప్రకటించారు. ఎల్ఐసీ వాళ్లతో మాట్లాడి డబ్బులు తెప్పించడానికి కొంత టైం పట్టిందని, అవి కూడా మొన్ననే వచ్చాయన్నారు. కొందరికి తక్కువగా వచ్చాయని, వాళ్లకు ప్రభుత్వం నుంచి కలిపి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు సంబురపడ్డారు. కానీ మంత్రి హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఎదురుచూపులు తప్పేలా లేవు.  

2009లో అభయహస్తం ప్రారంభం... 

స్వశక్తి సంఘాల మహిళలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉమ్మడి రాష్ర్టంలో 2009లో ఎల్ఐసీ ద్వారా అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. పొదుపు సంఘాల్లో సభ్యులైన 18 నుంచి 59 ఏండ్ల మహిళలు రోజుకో రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365 కడితే... ప్రభుత్వం అంతే మొత్తం జమ చేస్తుంది. 60 ఏండ్లు నిండగానే వారు జమ చేసిన డబ్బులను బట్టి నెలకు రూ.500 నుంచి ఆపైన పింఛన్ ఇవ్వడంతో పాటు సహజ మరణానికి రూ.30వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75వేలు చెల్లించేలా స్కీం రూపొందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలనెలా కాకుండా ఏడాదికోసారి పింఛన్ ఇచ్చారు. 2017 నుంచి ఈ స్కీంను పక్కన పెట్టేశారు. 60 ఏండ్లు నిండిన అభయహస్తం లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ఇస్తామని ప్రకటించినా కొంతమందికే దక్కింది. దీంతో అటు అభయహస్తం పింఛన్ రాక, ఇటు ఆసరా పింఛన్ అందక తిప్పలు పడాల్సి వస్తోంది.  

రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగానే..

అభయహస్తం పథకంలో రాష్ర్టవ్యాప్తంగా 20.15 లక్షల మంది సభ్యులున్నారు. 467 కోట్ల కార్పస్ ఫండ్ జమ కాగా, 2017–18 వరకు లబ్ధిదారుల, ప్రభుత్వ వాటాధనం రూ.4వేల కోట్లకు పైగా జమయినట్టు సమాచారం. తర్వాత పథకం ఉన్నట్టు గానీ, రద్దయినట్టు గానీ ప్రకటించకుండానే ప్రీమియం చెల్లింపులను నిలిపేసింది. ఎట్టకేలకు పైసలు వాపస్ చేస్తామని మంత్రి ప్రకటించినా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.

ఏడేండ్లైతంది..పింఛనేది

పెన్షన్​  వస్తుందేమోనని 2009 నుంచి 2015 వరకు అభయ హస్తం పైసలు కట్టిన. కేసీఆర్​ వచ్చిన తర్వాత ఉన్నయన్నీ ఊడవీకిండు. వచ్చే పింఛన్ రాకుంట చేసిండు. 57 ఏండ్లు ఉన్నోళ్లకు పింఛన్​ ఇస్తమన్నరు.నేనేమో ఏడేండ్ల నుంచి పింఛన్​కోసం చూస్తున్నా ఇస్తలేడు. వస్తదో రాదో. 

-జాడి రాజమ్మ, చాకెపెల్లి గ్రామం, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా