
బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో విజయం సాధించిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లిష్ టీమ్ నెగ్గితే.. రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ సేన భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. దాంతో ఐదు టెస్టుల సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టుపై ఇప్పుడు అందరి ఫోకస్ నిలిచింది. గురువారం (జులై 10) నుంచి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఆసక్తికరంగా మారింది. తొలిసారి భారత జట్టులో ఇద్దరు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నలుగురు పేసర్లతో టీమిండియా.. అర్షదీప్‌కు ఛాన్స్:
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ప్రతికూల ఫలితం వచ్చిన నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ తమ ప్లాన్ మార్చుకొని పేసర్లకు అనుకూలించే పిచ్ కావాలని అడిగినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌కు మరో 48 గంటల ముందు లార్డ్స్ స్టేడియంలోని వికెట్ పచ్చటి పచ్చికతో కనిపిస్తోంది. దానికి నీళ్లు కూడా పడుతున్నారు. గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌కు తుదిరూపు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ వికెట్‌పై మంచి పేస్‌తో పాటు బౌన్స్ కూడా లభించడం ఖాయమని తెలుస్తోంది. దీంతో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే బుమ్రా, ఆకాష్ దీప్, సిరాజ్ లతో పాటు విఫలమవుతున్న ప్రసిద్ కృష్ణ స్థానంలో అర్షదీప్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చు.
రేస్‌లో అభిమన్యు ఈశ్వరన్:
బ్యాటింగ్ విభాగంలో కరుణ్ నాయర్ మినహాయిస్తే మిగిలిన వారందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో వచ్చిన అవకాశాలను కరుణ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో 100 పరుగులు కూడా చేయలేదు. దీంతో కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ కు కాకుండా డొమెస్టిక్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కు ఛాన్స్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోన్నట్టు సమాచారం. అదే జరిగితే అభిమన్యు ఈశ్వరన్ టీమిండియా తరపున అరంగేట్రం చేయనున్నాడు.
మరోవైపు కరుణ్ నాయర్ కూడా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. తను పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ ముఖ్యంగా ఇంగ్లిష్ పరిస్థితులకు తగ్గట్టుగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్స్ బాల్స్‌ను ఆడటంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. దీంతో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లను పక్కన పెట్టి ఈశ్వరన్ కు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.