IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు కొత్త హెడ్ కోచ్‌‌ను ప్రకటించిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు కొత్త హెడ్ కోచ్‌‌ను ప్రకటించిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కొత్త ప్రధాన కోచ్ గా అభిషేక్ నాయర్ నియమించింది. ఈ విషయాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ గురువారం (అక్టోబర్ 30) అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత కేకేఆర్  ఫ్రాంచైజీతో విడిపోయిన చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్ హెడ్ కోచ్ బాధ్యతలు సీకరిస్తాడు. నాయర్ కేకేఆర్ ఫ్రాంచైజ్ సెటప్‌లో చాలా కాలంగా సభ్యుడిగా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్ గా సేవలను అందించాడు. రింకు సింగ్, హర్షిత్ రాణా వంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ను వెలికి తీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

2024లో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు అభిషేక్ నాయర్ కోచింగ్ స్టాఫ్ లో సభ్యుడు. ప్రస్తుతం భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2024లో చంద్రకాంత్ పండిట్ హయాంలో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఆ క్రెడిట్ మొత్తం ఫ్రాంచైజీ మెంటర్ గౌతమ్ గంభీర్ కు దక్కింది. 2025లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పేలవ ప్రదర్శన కారణంగా చంద్రకాంత్ పై విమర్శల వర్షం వచ్చింది.  

ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ ప్రధాన కోచ్‌ బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో చంద్రకాంత్ పండిట్‌ నియమితులయ్యారు. తన తొలి సీజన్ (2023) లో జట్టు ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. 2024 లో శ్రేయాస్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరకపోవడంతో ఆయన తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు.