Abhishek Sharma: పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర.. టీ20 బ్యాటర్లలో అత్యధిక పాయింట్లతో అభిషేక్ శర్మ వరల్డ్‌‌ రికార్డు

Abhishek Sharma: పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర.. టీ20 బ్యాటర్లలో అత్యధిక పాయింట్లతో అభిషేక్ శర్మ వరల్డ్‌‌ రికార్డు

ఆసియా కప్‌‌లో తన పవర్‌‌‌‌హిట్టింగ్‌‌తో ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగించిన టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్‌‌ శర్మ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్‌‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం (అక్టోబర్ 1) విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌లో అభిషేక్ 931 రేటింగ్ పాయింట్లు సాధించి, ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఆసియా కప్‌‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌గా నిలిచిన అభిషేక్.. 2020లో డేవిడ్ మలాన్ (919 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్ లో ఈ పంజాబీ స్టార్ 314 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 44 కాగా.. స్ట్రైక్ రేట్ 200 కావడం విశేషం. 

ఈ క్రమంలో అభిషేక్ తన టీమ్‌‌ మేట్స్ సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లను కూడా అధిగమించాడు. బ్యాటర్లలో అభి తన టాప్ ర్యాంక్‌‌ను మరింత బలోపేతం చేసుకోగా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ర్యాంకింగ్స్‌‌లో తన నం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు, ఆసియా కప్ ఫైనల్ హీరో హైదరాబాదీ తిలక్ వర్మ మూడో ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు. అయితే, ఆల్-రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా  టాప్ ప్లేస్ కోల్పోయాడు. పాకిస్తాన్ ఆల్-రౌండర్ సైమ్ అయూబ్.. పాండ్యాను రెండో స్థానానికి నెట్టి తొలిసారి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

వన్డేల్లోనూ అభిషేక్ కు ఛాన్స్: 

ఇప్పటివరకు టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న అభిషేక్ ఇకపై వన్డే క్రికెట్ లోకి రానున్నట్టు సమాచారం. ఇటీవలే జరిగిన  ఆసియా కప్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్న ఈ పంజాబ్ హిట్టర్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అక్టోబర్ 19 నుంచి అస్త్రలియాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు అభిషేక్ కు ఛాన్స్ దక్కనుందని సమాచారం. అతని బ్యాటింగ్ నైపుణ్యం వన్డేలకు కూడా సరిపోతుందని గంభీర్ భావిస్తున్నాడట. స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడం అభిషేక్ శర్మకు కలిసి రానుంది. స్క్వాడ్ లో చోటు సంపాదించుకున్నా తుది జట్టులో అభిషేక్ శర్మకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.