IND vs WI 1st Test: ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డ్.. శ్రీనాథ్, కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా

IND vs WI 1st Test: ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డ్.. శ్రీనాథ్, కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో తన పేస్ బౌలింగ్ తో సత్తా చాటాడు. గురువారం (అక్టోబర్ 2) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో విండీస్ జట్టుపై మూడు వికెట్లు తీసి ఇండియాలో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు ఇండియాలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. 24 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించిన బుమ్రా.. శ్రీనాధ్ తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. 

యావరేజ్, బంతుల పరంగా చూసుకుంటే శ్రీనాధ్ కంటే బుమ్రా ముందున్నాడు. కేవలం 1747 బంతుల్లోనే 17 యావరేజ్ తో బుమ్రా 50 వికెట్ల మార్క్ అందుకోవడం విశేషం. దీంతో అగ్రస్థానంలో బుమ్రానే ఉన్నాడు. బుమ్రా, శ్రీనాధ్ తర్వాత స్థానాల్లో వరుసగా కపిల్ దేవ్ (25 ఇన్నింగ్స్), ఇషాంత్ శర్మ (27 ఇన్నింగ్స్), మహమ్మద్ షమీ (27 ఇన్నింగ్స్) నిలిచారు. ఓవరాల్ గా బుమ్రా 49 టెస్టులో 92 ఇన్నింగ్స్ ల్లో 222 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా యావరేజ్ కేవలం 20 లోపు ఉండడం గమనార్హం. ప్రస్తుతం టెస్ట్ బౌలర్లలో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్న బుమ్రా.. అంచనాలను అందుకుంటూ సుదీర్ఘ ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ఆరంభంలో విండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ ను ఔట్ చేసిన బుమ్రా.. టైలండర్ పనిపట్టాడు. ఒక స్టన్నింగ్ యార్కర్ తో జస్టిన్ గ్రీవ్స్ (32) క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే జోహన్ లేన్ (1) ను మరొక అద్భుత యార్కర్ తో పెవిలియన్ కు పంపాడు. బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. 

32 పరుగులు చేసిన జస్టిన్ గ్రీవ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ ఛేజ్(24), షై హోప్ (26) పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు..  కుల్దీప్ యాదవ్ రెండు.. సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు. 5 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ తమ చివరి ఐదు వికెట్లను 72 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.  తొలి సెషన్ లో 90 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ రెండో సెషన్ లో 72 పరుగులకు చివరి 5 వికెట్లను చేజార్చుకుంది.