
రాజస్థాన్లో అమానుష ఘటన జరిగింది. బొలెరోకు పొరపాటున ఎద్దు తగిలిందని మితిమీరిన కోపంతో అదే బొలెరో వాహనంతో ఎద్దును తొక్కి చంపేసిన క్రూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని సికర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల హృదయం ద్రవించిపోయింది. వీడియో చూసిన మనకే ఇంత హృదయ విదారకంగా అనిపిస్తుంటే.. అంత పాపం చేయడానికి ఆ క్రూరులకు మనసెలా వచ్చిందోనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బవరియా ఫ్యామిలీ పెళ్లి ఊరేగింపులో భాగంగా రోడ్డుపై వెళుతున్న బొలెరో వాహనాన్ని బెదిరిపోయిన ఒక ఎద్దు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనానికి ముందు భాగంలో సొట్ట పడింది. ఈ పరిణామంతో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ఎద్దుపై విపరీతమైన కోపమొచ్చింది.
ఎంతలా అంటే ఆ ఎద్దును ఢీ కొట్టి చంపేంత మూర్ఖంగా కారులో ఉన్న వాళ్లంతా ప్రవర్తించిన తీరు సభ్య సమాజానికే సిగ్గుచేటు. మూగ జీవి తెలియక చేసిన పొరపాటుకు చావును శిక్షగా వేసిన వీళ్ల క్రూరత్వాన్ని ఏమనాలి..? అసలు వీళ్లు మనుషులా..? రాక్షసులా..? అని ఈ వీడియో చూసిన నెటిజన్లు భగ్గుమన్నారు. ముందు వెళుతున్న ఎద్దును తొలుత బొలెరోతో ఢీ కొట్టారు. ఆ ఎద్దు తీవ్ర గాయాలపాలై కిందపడిపోయింది. పైకి లేవలేక నొప్పితో విలవిలలాడుతున్న ఆ మూగ జీవాన్ని బొలెరో వాహనం రివర్స్ చేసి మరీ మళ్లీ దూసుకొచ్చి ఏకంగా పడిపోయిన ఎద్దు పైకి ఎక్కించి తొక్కించేశారు. తీవ్ర గాయాల పాలైన ఆ మూగ జీవి చనిపోయింది.
ఎద్దును వదిలేయాలని స్థానికులు ఎంత చెప్పినా ఆ బొలెరోలో ఉన్న ఏ ఒక్కరూ వినలేదు. ఆ మూగ జీవాన్ని చంపిన తర్వాతే అక్కడ నుంచి వాళ్లు వెళ్లిపోయారు. కొందరు మనుషుల్లో ఇంత క్రూరత్వం నిండుకుని ఉండటం ఎంతో ఆందోళన కలిగించే విషయం. స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన డ్రైవర్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు. రాజస్థాన్లోని సికార్ జిల్లా నెచ్వా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘోరాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Rajasthan's Heart-Wrenching Cruelty: Bull Repeatedly Run Over by Car in Sikar.
— Trending Eyes🇮🇳 (@thetrendingeyes) October 2, 2025
In a gut-wrenching act of barbarity that has left animal lovers reeling, a heartless driver in Rajasthan's Sikar district's Nechwa area deliberately ran over a bull, with his car multiple times,… pic.twitter.com/HwI8ZSLHFg