స్కూల్ ఫీజులకు లక్షలు కుమ్మరిస్తున్న ఇండియన్ పేరెంట్స్.. ఈ సీఏ చెప్పింది చేస్తే మీకే రూ.50 లక్షలు మిగులుతాయ్!

స్కూల్ ఫీజులకు లక్షలు కుమ్మరిస్తున్న ఇండియన్ పేరెంట్స్.. ఈ సీఏ చెప్పింది చేస్తే మీకే రూ.50 లక్షలు మిగులుతాయ్!

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఖర్చులు ఒక విద్య కాగా రెండవది వైద్యం. చిన్న పట్టణాల్లో పిల్లల్ని చదివించాలన్నా ఏడాదికి రూ.50 నుంచి రూ.60వేల వరకు ఖర్చవుతోంది. ఇక మెట్రో సిటీల్లో పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో అడ్మిషన్లు దొరకాలంటేనే లక్షలు పోయాల్సి వస్తోంది. పైగా పిల్లల చదువు అనేది భారతీయ తల్లిదండ్రులకు ఒక ఎమోషన్ అందుకే అప్పుచేసైనా వారిని మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడుతుంటాయి కుటుంబాలు. కానీ పెరిగిపోతున్న ఫీజులు, చదువు ఖర్చులకు ఒక సీఏ ఇచ్చిన ప్రాక్టికల్ పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం....

సీఏ నితిన్ కౌషిక్ పిల్లల చదువులు పేరెంట్స్ కి భారంగా మారకుండా ఉండేందుకు ఎలా పెట్టుబడి ప్లాన్ చేసుకోవాలో వివరించారు. దీనివల్ల అప్పులు, ఒత్తిడి లేకుండా చదువులకు డబ్బు సమకూర్చుకుని చేతిలో రూ.50 లక్షలు మిగిలే ఉపాయం చెప్పారు. ఇది దేశంలో ఇబ్బంది పడుతున్న 99 శాతం తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని సూచించారు. 

సీఏ నితిన్ ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ముందు నుంచే అంటే వారు పుట్టినప్పుడే నెలకు రూ.10వేలు పెట్టుబడిగా పెట్టడం కొనసాగించాల్సి ఉంటుంది. పైగా ప్రతి ఏటా పెట్టుబడిని 10 శాతం పెంచుకుంటూ 10 సంవత్సరాలు కొనసాగిస్తే చాలు. మీ పిల్లలకు 10 ఏళ్లు వచ్చినప్పటి నుంచి వారికి 22 ఏళ్ల వరకు చదువుల కోసం ప్రతి నెల రూ.25వేలు పెట్టుబడి నుంచి వెనక్కి తీసుకుని వారి చదువులకు ఆటంకం లేకుండా చేయవచ్చని వివరించారు కౌషిక్. 

ఇక్కడ ప్రతి నెల పెట్టుబడిపై 12 శాతం సగటు రాబడిని లెక్కింపుకు తీసుకున్నారు. నెలకు రూ.10వేల చొప్పున 10 ఏళ్ల పాటు రూ.19లక్షల 12వేలు ఇన్వెస్ట్ చేస్తారు. దీని విలువ రూ.32లక్షల 69వేలకు పైన చెప్పిన 12 శాతం రాబడి చొప్పున పెరుగుతుంది. దీని నుంచి తర్వాతి 12 సంవత్సరాల పాటు పిల్లల చదువుల కోసం రూ.36 లక్షలు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకున్నా.. చివరికి అంటే పిల్లలకు 22 ఏళ్లు వచ్చేనాటికి కాంపౌండింగ్ వల్ల రూ.51 లక్షలు పెట్టుబడి ఖాతాలో మిగిలే ఉంటాయి. ఇదే క్రమంలో ఎమర్జెన్సీగా డబ్బు వెనక్కి తీసుకునేందుకు లిక్విడిటీ ఉండే ఫండ్స్ కూడా పెట్టుబడిలో ఉండేలా చూసుకోవటం ముఖ్యం తల్లిదండ్రులు.