IND vs WI 1st Test: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‪లో 162 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

IND vs WI 1st Test: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‪లో 162 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలింగ్ లో అదరగొట్టింది. గురువారం (అక్టోబర్ 2) ప్రారంభమైన ఈ టెస్టులో టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపించి ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. 32 పరుగులు చేసిన జస్టిన్ గ్రీవ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ ఛేజ్(24), షై హోప్ (26) పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు..  కుల్దీప్ యాదవ్ రెండు.. సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.          

5 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ తమ చివరి ఐదు వికెట్లను 72 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. తొలి సెషన్ లో సూపర్ స్పెల్ తో ఆకట్టుకున్న సిరాజ్.. రెండో సెషన్ తొలి స్పెల్ లో ఒక అద్భుతమైన డెలివరీతో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ను ఔట్ చేశాడు. ఈ దశలో జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియరీ స్వల్ప భాగస్వామ్యంతో విండీస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. కాసేపు విసుగు తెప్పించిన ఈ జోడీని ఎట్టకేలకు సుందర్ విడగొట్టాడు. ఖారీ పియరీ (11) ని ఔట్ చేసి ఇండియాకు ఏడో వికెట్ అందించాడు. 

టైలండర్ పనిని బుమ్రా చూసుకున్నాడు. ఒక స్టన్నింగ్ యార్కర్ తో జస్టిన్ గ్రీవ్స్ (32) క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే జోహన్ లేన్ (1) ను మరొక అద్భుత యార్కర్ తో పెవిలియన్ కు పంపాడు. కుల్దీప్ చివరి వికెట్ తీసుకొని విండీస్ కథను ముగించాడు. తొలి సెషన్ లో 90 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ రెండో సెషన్ లో 72 పరుగులకు చివరి 5 వికెట్లను కోల్పోయింది. అంతకముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం బెడిసి కొట్టింది. గ్రీన్ వికెట్ పై టీమిండియా పేసర్లు సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. టాగెనరైన్ చంద్రపాల్ వికెట్ తీసుకొని సిరాజ్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. 

20 పరుగుల వద్ద జాన్ కాంప్‌బెల్ ను బుమ్రా ఔట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కొన్ని ఓవర్ల పాటు విండీస్ జట్టు సహనంగా ఆడింది. అయితే మహమ్మద్ సిరాజ్ ఈ సారి విండీస్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్ లను పెవిలియన్ కు పంపి విండీస్ జట్టును కష్టాల్లో పడేశాడు. 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వెస్టిండీస్ జట్టును కెప్టెన్ రోస్టన్ ఛేజ్, షాప్ హోప్ ఆదుకున్నారు. 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పర్వాలేదనిపించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లంచ్ బ్రేక్ కు ముందు బిగ్ షాక్ ఇచ్చాడు. మంచి టచ్ లో కనిపించిన షాయ్ హోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.