
ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఎంతలా చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ ఇండియా పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఈ వివాదం ఆసియా కప్ తో ముగిసిందనుంకుంటే ఇప్పుడు మళ్ళీ కొనసాగనుందని సమాచారం. భారత మహిళా జట్టు 2025 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని బీసీసీఐ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2025లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ లేదా ఫోటో షూట్‌లు చేయదు. "బీసీసీఐ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంది. టాస్ వద్ద ఆచారబద్ధంగా షేక్ హ్యాండ్ ఉండదు. అదే విధంగా మ్యాచ్ రిఫరీతో ఫోటో షూట్ చేయబడదు. మ్యాచ్ ముగిశాక కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్స్ ఉండవు. మెన్స్ మాదిరిగానే ఉమెన్స్ కూడా ఈ విధానాన్ని కొనసాగించనున్నారు". అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఈ వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య అక్టోబర్ 5న మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని కొలంబో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇండియా, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ లో తలపడ్డాయి. దీంతో ఇరు జట్లు ఫార్మాలిటీగా మ్యాచ్ ఆడడానికి వచ్చామని చెప్పకనే చెప్పారు. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదని.. బాయ్ కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆడినప్పటికీ పాకిస్థాన్ తో టీమిండియా ఎలాంటి షేక్ హ్యాండ్స్ గానీ.. ఫోటో షూట్స్ గానీ ఇవ్వలేదు. పాకిస్థాన్ తో ఫైనల్ గెలిచిన తర్వాత కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ప్లేయర్లు నిరాకరించారు.