V6 News

ఉప్పల్‌లో అభిషేక్ శర్మ 'సునామీ'.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే!

ఉప్పల్‌లో అభిషేక్ శర్మ 'సునామీ'.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే!

 IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు శివతాండవం చేశారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ క్లాస్– మాస్ ఇన్నింగ్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో SRH 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ టార్గెట్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు పెట్టింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఒక సునామీలా సాగింది. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న అభిషేక్, ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి 68 బంతుల్లో 135 పరుగులు (10 ఫోర్లు, 10 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ఢిల్లీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపించాడు.

హెడ్ అదిరిపోయే ఆరంభం: 
టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ట్రావిస్ హెడ్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు) చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 13 బంతుల్లో 25 పరుగులు చేసిన ఇషాన్, దురదృష్టవశాత్తూ నితీష్ రాణా బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు.

క్లాసెన్ ఫినిషింగ్ టచ్: 
మిడిల్ ఓవర్లలో పరుగులు కాస్త నెమ్మదించినా, హెన్రిచ్ క్లాసెన్ రాకతో మళ్ళీ సీన్ మారిపోయింది. లుంగి ఎంగిడి వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా రెండు సిక్సర్లు బాది ఆరెంజ్ ఆర్మీలో జోష్ నింపాడు. చివరి ఓవర్లో క్లాసెన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా.. అభిషేక్ ఒక ఫోర్ బాదాడు. మొత్తంగా ఆఖరి ఓవర్లో 20 పరుగులు పిండుకున్నారు. అయితే క్లాసెన్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు) మెరుపు బ్యాటింగ్ తో నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్– -క్లాసెన్ జోడీ కేవలం 32 బంతుల్లోనే 66 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ఢిల్లీ బౌలర్ల బేజారు: 
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ మినహా మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. నటరాజన్ 19వ ఓవర్లో కేవలం 6 పరుగులే ఇచ్చి కట్టడి చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను హైదరాబాద్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి.