ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‎లో SRH ప్లేయర్ల హవా.. హెడ్‎ను వెనక్కి నెట్టి టాప్‎కు అభిషేక్

ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‎లో SRH ప్లేయర్ల హవా.. హెడ్‎ను వెనక్కి నెట్టి టాప్‎కు అభిషేక్

దుబాయ్: టీమిండియా ఆల్‌‌‌‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌‌‌‌లో వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్​ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోగా, యంగ్‌‌‌‌ బ్యాటర్ అభిషేక్ శర్మ  టీ20 ఫార్మాట్‌‌‌‌లో తొలిసారిగా టాప్ ప్లేస్‌‌‌‌కు చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్ట్ ఆల్‌‌‌‌రౌండర్ల జాబితాలో జడేజా మొత్తం 422 పాయింట్లతో టాప్‌‌‌‌లో నిలిచాడు.  రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌‌‌‌కు చెందిన మెహిదీ హసన్ మిరాజ్ కంటే 117 రేటింగ్ పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టెస్టులో సెంచరీకి తోడు నాలుగు వికెట్లు పడగొట్టడంతో అతని రేటింగ్ పాయింట్లు మెరుగయ్యాయి. 

ఈ పెర్ఫామెన్స్‌‌‌‌తో అతను బ్యాటర్లలో ఐదు స్థానాలు మెరుగై 29వ ప్లేస్‌‌‌‌కు, బౌలర్లలో 15 నుంచి 14వ ర్యాంక్‌‌‌‌కు చేరాడు. మరోవైపు ఏడాదిగా టీ20 బ్యాటర్లలో టాప్ ప్లేస్‌‌‌‌లో నిలిచిన ఆస్ట్రేలియా హిట్టర్‌‌‌‌‌‌‌‌ ట్రావిస్ హెడ్ నుంచి అభిషేక్ శర్మ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌‌‌‌ జట్టుతో ఆస్ట్రేలియా 5–-0తో గెలిచిన ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌కు హెడ్ దూరమవడంతో అతను రెండో ప్లేస్‌కు పడిపోయాడు. అభిషేక్ శర్మ రెండు నుంచి ఒకటో ప్లేస్‌‌‌‌కు చేరి తొలిసారి టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌‌గా నిలిచాడు. 

అభి ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లు ఉండగా.. హెడ్ 814 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టెస్టులో సెంచరీ కొట్టిన వాషింగ్టన్ సుందర్ ఆల్‌‌‌‌రౌండర్లలో 8 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 13వ స్థానం అందుకున్నాడు. ఇక టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్ రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్‌‌‌‌రౌండర్లలో 6 నుంచి 3వ ప్లేస్‌‌‌‌కు వచ్చాడు. 2022 డిసెంబర్ తర్వాత అతనికిదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.