భద్రాచలం సీతారామయ్యకు అభిషేకం, బంగారు పుష్పార్చన

భద్రాచలం  సీతారామయ్యకు అభిషేకం, బంగారు పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరులకు ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాతసేవ అనంతరం బాలబోగం నివేదించి మూలవరులకు స్నపన తిరుమంజనం చేశారు. భక్తులకు అభిషేక జలాలను అందజేశారు. అనంతరం మూలవరులను అలంకరించి ప్రత్యేక హారతులిచ్చారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. 

విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించి కల్యాణ క్రతువును ముగించారు. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం బేడా మండపంలోనే శ్రీసీతారామచంద్రస్వామికి దర్బారు సేవ జరిగింది. హైదరాబాద్​కు చెందిన లింగం శ్రీకాంత్, లక్ష్మీభవాని దంపతులు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు.