అమరావతి: ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల( సివిల్ అసిస్టెంట్ సర్జన్ )పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వేటు వేసింది. నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబంధనలను అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతో పాటు అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో.. విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
మే నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. ఇదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్,ఆర్థో, గైనిక్ ఇతర వైద్యులు ఉన్నారు
►ALSO READ | మీ దుంప తెగ.. ఇలా ఉన్నారేంట్రా: ATM ఎత్తుకెళ్లిన దొంగలు
నిజానికి.. 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుంచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది.
ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు తర్వాత రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని నిర్ణయించింది.
