మీ దుంప తెగ.. ఇలా ఉన్నారేంట్రా: ATM ఎత్తుకెళ్లిన దొంగలు

మీ దుంప తెగ.. ఇలా ఉన్నారేంట్రా: ATM ఎత్తుకెళ్లిన దొంగలు

దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఇళ్లలో చోరీ చేస్తారు. ఇంకొందరు బ్యాంకులను లూటీ చేస్తారు. మరికొందరు ఇంటి ముందున్న వాహనాలను ఎత్తుకెళ్తుంటారు. కానీ వీళ్లు మాత్రం వెరైటీ దొంగలు. ఏకంగా ఏటీఎం మిషనే ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్తే ఏం కిక్ ఉంటుందనుకున్నరేమో మరీ.. ఏకంగా ఏటీఎం మిషనే లేపుకెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‎లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో ఎస్‎బీఐ ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు దొంగలు. బుధవారం (జూన్ 17) తెల్లవారుజామున రాడ్లతో బద్దలుకొట్టి మిషన్ లేపుకెళ్లారు. చోరీ చేసిన ఏటీఎం మిషన్‎ను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో పగలగొట్టారు. అనంతరం పెట్రోల్ పోసి మిషన్ తగలబెట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన ఏటీఎం బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని ఎస్‎బీఐఏటీఎం మిషన్‎గా గుర్తించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం‎లో  డబ్బులు ఉన్నాయా లేదా అన్నది బ్యాంక్ అధికారులు దృవీకరించాల్సి ఉంది. దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్‎నే ఎత్తుకెళ్లిన ఘటన బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.