ఓయూలో అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు

ఓయూలో అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు
  • అడ్డుకునేందుకు వెళ్లిన విద్యార్థి నాయకులపై దాడి
  • వర్సిటీ పరిపాలన భవనం వద్ద విద్యార్థుల ఆందోళన

సికింద్రాబాద్, వెలుగు: హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ వన్ కాకతీయ కాలనీలోని ఓయూ స్థలంలో గురువారం రాత్రి 11 గంటలకు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై దుండగుల దాడి చేశారు. ఓయూ విద్యార్థి, ఏబీవీపీ కార్యకర్త వికాస్ కి తీవ్ర   గాయాలయ్యాయి. అక్రమ నిర్మాణాలను, దాడిని ఖండిస్తూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం వర్సిటీ పరిపాలన భవనం ముందు ఆందోళనకు దిగారు. వీసీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఓయూ భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే  వీసీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. ఇదే టైంలో క్యాంపస్​లో బహుజన విద్యార్థి సంఘాలు, టీఎస్​ఓయూ జేఏసీ నాయకులు  ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. బయటి వ్యక్తులు వచ్చి వర్సిటీ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే ఓయూ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. లీజుల పేరుతో భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వీసీ రవీందర్​యాదవ్​ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు చేరుకున్న రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ దాడికి పాల్పడిన వారిపై  చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా ను విరమించారు. ఆందోళనల్లో ఏబీవీపీ నాయకులు శ్రీహరి, జీవన్, కమల్ సురేశ్, పృథ్వి, రాజు, ఝాన్సీ, టీఎస్​ జేఏసీ  చైర్మన్​ బట్టు శ్రీహరి నాయక్, బహుజన విద్యార్థులు విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమించేవారిపై కఠిన చర్యలు

కాకతీయ నగర్​లోని ఓయూ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను ఓయూ వీసీ రవీందర్​, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ పరిశీలించారు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. కబ్జాకు యత్నించిన వారిపై కేసులు పెడతామని చెప్పారు.