విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకోం

విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకోం

బాసర: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న విద్యార్థులను బర్తరఫ్ చేస్తామనడం సిగ్గుచేటు అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు వెంటనే తమ ఆందోళనను విరమించాలని... లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వెంకట రమణ హెచ్చరించిన నేపథ్యంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి స్పందించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆయన... ఇది  కరెక్ట్ పద్ధతి కాదన్నారు. 

విద్యార్థులకు  నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ దయనీయ స్థితికి బాసర ట్రిపుల్ ఐటీ నిదర్శనమన్నారు. ఉప ఎన్నిక సమయంలో వందల కొద్దీ సర్వేలు చేయించుకునే కేసీఆర్... బాసర విద్యార్థులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం రాద్దాంతం చేస్తోందన్న ఆయన... విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.