విద్యా సంస్థల్లో అధిక పీజులను నియంత్రించాలె

విద్యా సంస్థల్లో అధిక పీజులను నియంత్రించాలె

హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని, అధిక ఫీజును నియంత్రించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ నియంత్రణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కార్పొరేట్ కాలేజీల దోపిడిని అరికట్టాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా (రేపు) ఆగస్టు 22న కార్పొరేట్ కళాశాలల ముందు ధర్నా, (ఎల్లుండి) ఆగస్టు 23న  ఇంటర్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చామన్నారు.

నారాయణ, శ్రీ చైతన్య వంటి కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని, పేదోడికి విద్యను దూరం చేశాయని ఆరోపించారు. ర్యాంకులు, స్పెషల్ బ్యాచుల పేర్లతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు. విద్యా సంస్థల్లో బుక్స్, డ్రెస్సెస్ వంటివి అమ్మొద్దని ఉన్నప్పటికీ... కాలేజీలు, పాఠశాలలు ఇవేమీ పట్టించుకోవడంలేదని తెలిపారు. చదువు పూర్తైన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధిక ఫీజు కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేశారు. ఇటీవలి రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటన అందుకు నిదర్శనమన్నారు. ఇది కేవలం రామంతాపూర్ కు పరిమితమైన సమస్య కాదని... రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వెల్లడించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీలను సీజ్ చేయాలని, కాలేజీ హాస్టళ్లలో ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.