ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడిని అరికట్టాలి

ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడిని అరికట్టాలి

హైదరాబాద్:  ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ జులై 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందని ఆరోపించారు. విద్యా సంవత్సరం మొదలై పదిహేను రోజులు దాటినా కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లుగా ఫీజులు పెంచుతుంటే... ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి... ఫీజు నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు పేద మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నాయని తెలిపారు. 

విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా జులై 5న చేపట్టనున్న పాఠశాలల బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. 

ఏబీవీపీ ప్రధాన డిమాండ్స్

  • సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు, డ్రెస్ లు అందించాలి.
  • ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు -మన బడి కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.
  • పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, డీఈవో, ఎమ్ఈవో  పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
  • ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.
  • ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి.
  • ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.
  • బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న  ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై కఠినంగా వ్యవహారించాలి.
  • ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.
  • విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.