
జీడిమెట్ల, వెలుగు: ఓ ఇంట్లో ఏసీ పేలడంతో ఫర్నిచర్ దగ్ధం కావడంతో పాటు ఓ మహిళకు గాయాలయ్యాయి. చీరాలకు చెందిన జ్యోతి(65) బాచుపల్లి సాయి అనురాగ్కాలనీలోని ఎస్ఆర్కే ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ 101లో నివాసముంటోంది. చీరాల నుంచి అప్పుడప్పుడు వచ్చి బాచుపల్లిలో ఉండి వెళ్తుంటుంది. సోమవారం బాచుపల్లికి వచ్చిన జ్యోతి రాత్రి ఏసీ వేసుకుని పడుకుంది. మంగళవారం ఉదయం గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగాయి.
జ్యోతికి గాయాలయ్యాయి. ఇంట్లోని అన్ని గదుల్లో ఉన్న ఫర్నిచర్ దగ్ధమైంది. బయటకు దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళ చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. హైడ్రా సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏసీలో ఉన్న గ్యాస్ లీకేజీ కావడంతో, స్టవ్ వెలిగించగానే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.