ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను ఓడిద్దాం

ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను ఓడిద్దాం
  • రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తీర్మానం  

ఎల్ బీనగర్, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 45 లక్షల మంది మాలలు తమ భవిష్యత్ కోసం రేపటి ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చింది. కొత్తపేట చౌరస్తాలోని ఓ హోటల్​లో శనివారం 33 జిల్లాల మాల సంఘాల నాయకులు, ఆ సామాజిక వర్గం మేధావులు, కవులు, రచయితలు, ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. మాలలకు న్యాయం చేసే పార్టీలకే ఎన్నికల్లో మద్దతు తెలపాలని నిర్ణయించారు.

‘‘అన్ని నియోజకవర్గాల్లో మాల భవన్ ల కోసం 5 ఎకరాల చొప్పున భూమి, రూ. 10 కోట్ల చొప్పు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చే పార్టీలకే మద్దతు ఇద్దాం. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిద్దాం” అని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బేర బాలకిషన్, తాళ్లపల్లి రవి, జిల్లాల నుంచి వచ్చిన మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.