- పేకాట కేసు నుంచి తప్పించేందుకు రూ.30 వేలు డిమాండ్
- రూ.15 వేలు డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత
హసన్ పర్తి, వెలుగు: పేకాట కేసు నుంచి తప్పించేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్, డ్రైవర్ ఎండీ నజీర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 29న గోపాలపూర్ లో టాస్క్ ఫోర్స్, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని పట్టుకొని, రూ.1.86 లక్షల నగదు, 4 వాహనాలను సీజ్ చేశారు.
ఈ కేసులో దొరికిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పిస్తానని చెప్పిన ఎస్సై రూ.30 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.15 వేలు ఇస్తానని, మిగిలిన డబ్బులు రెండు రోజుల తరువాత ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత ఎస్సై బాధితుడికి ఫోన్ చేసి బెదిరించడంతో భాదితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం సాయత్రం రూ.15 వేలు కేయూ జంక్షన్ వద్ద ఎస్సై శ్రీకాంత్, ఆయన డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.
