
తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది ఏసీబీ. అయినా ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. లంచాల కోసం టేబుల్ కింద చేయిపెడుతున్నారు.
లేటెస్ట్ గా ఆగస్టు 12న వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా ఓ మహిళా ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికింది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం .. రెవెన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నవాబుపేట మండల పరిధిలోని రెండు ఎకరాల అసైన్డ్ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాలయానికి ప్రొసిడింగ్ కాపీ పంపించడానికి 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసింది మహిళా ఉద్యోగి సుజాత. కలెక్టర్ సంతకం కోసం టేబుల్ మీద ఫైల్ పెట్టడానికి 5 వేల రూపాయలు ముందుగానే పోన్ పే ద్వారా తీసుకుంది సుజాత.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్‌ఫ్రీ నంబర్‌ను, వాట్సాప్ నంబర్‌ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.