
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని అశ్వారావుపేట, పాల్వంచ చెక్ పోస్టులను ఏసీబీ ఆఫీసర్లు శనివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా అశ్వారావుపేట చెక్ పోస్టులో తనిఖీల్లో లెక్కలేని రూ. 23వేలు, పాల్వంచ చెక్ పోస్టులో రూ. 26వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ సిబ్బందితో అక్రమ వసూళ్లకు ఆర్టీఏ ఆఫీసర్లు పాల్పడుతున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ దాడులు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో కొనసాగాయి.
పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసీబీ అధికారులు శనివారం అర్దరాత్రి 12 గంటల నుండి ఆదివారం ఉదయం 9 గంటల వరకు సోదాలు నిర్వహించారు.ఈ సోదల్లో రికార్డు లో లేని రూ.6,660 నగదును సీజ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని గుర్తించారు. అక్రమ వసూళ్లపై విధుల్లో ఉన్న ఎంవీఐ విజయశాంతిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
చెక్ పోస్ట్ లో రికార్డులు, కంప్యూటర్ డేటా పరిశీలించారు. అంతరాష్ట్ర వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తూన్నరనే ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చెక్ పోస్ట్ వద్ద లారీలను ఆపి డ్రైవర్లు డబ్బులు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పాల్వంచ: పాల్వంచ మండలంలోని నాగారంలో గల ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యాలయం కేంద్రంగా నిర్వహించిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. తనిఖీల సమయం లో చెక్ పోస్ట్ లో ఉన్న రూ.25 వేల అనధికారిక నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు.