
రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ సీఎం చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమయ్యింది. జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో చంద్రబాబు విచారణ జరుగుతోంది. గంటకు ఐదు నిముషాల పాటు చంద్రబాబుకు విరామం ఇవ్వనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ విరామం. రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ విచారించనుంది.
స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది. అందుకు సంబంధించిన అంశాలపై చంద్రబాబును ప్రశ్నించనుంది. వాటికి చంద్రబాబు చెప్పే సమాధానాలను రికార్డ్ చేయనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది.
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని తెలిపింది. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలి. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని.. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలి.
Also Read :-అక్టోబర్ 2న మహబూబ్ నగర్లో మోడీ బహిరంగ సభ
కనిపించే దూరంలో న్యాయవాది
విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలి. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలి. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలి. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలి.
విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి
సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించినప్పుడు సాక్షి కెమెరామన్, వీడియోగ్రాఫర్ చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పత్రికల క్లిప్పింగ్‌లను న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి నందినీ శత్పతి కేసులో లాగే..
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందినీ శత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సమయంలో పాటించేలా సీఐడీని ఆదేశించాలని దమ్మాలపాటి విన్నవించగా... సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
విచారణ సమయంలో ఏడుగురు న్యాయవాదులు...
సీఐడీ విచారణ జరిగేటప్పుడు చంద్రబాబు తరఫున హాజరయ్యేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీలును బట్టి వారిలో ఎవరో ఒకరు హాజరవుతారు.