
గొర్రెల స్కాం కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గచ్చిబౌలిలో నమోదైన గొర్రెల స్కాం కేసును అధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి హైకోర్టును ఆశ్రయించారు. గొర్రెల స్కాం పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు, పిటిషన్ కొట్టివేసింది. ఏసీబీ డీజీ సీ.వీ ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డాక్యుమెంట్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు.