లంచం అడిగిన్రు ఏసీబీకి చిక్కిన్రు

లంచం అడిగిన్రు ఏసీబీకి చిక్కిన్రు

జీడిమెట్ల, రామచంద్రాపురం, వెలుగు: లంచం తీసుకుంటూ ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్తు డీఈ, వీఆర్వో ఏసీబీకి చిక్కారు. మేడ్చల్​జిల్లా కొంపల్లి పరిధిలో కొత్త వెంచర్లో ట్రాన్స్​ఫార్మర్, అండర్ గ్రౌండ్​ఏర్పాటుకు సంబంధించిన పనులను బాలనర్సింహ అనే కాంట్రాక్టరు  మరొకరి నుంచి సబ్​కాంట్రాక్ట్​తీసుకున్నాడు. ఈ పని కోసం ఏఈ, ఏడీఈలు ఎస్టిమేషన్​ వేసి డీఈకి పంపించారు.  ఈ ఎస్టిమేషన్​ను ఎస్ఈకి పంపించకుండా మేడ్చల్​డీఈ కె.ప్రసాదరావు  తన వద్ద పెండిగ్​పెట్టుకున్నాడు. ఎస్ఈకి పంపడానికి రూ.40 వేలు లంచం డిమాండ్​ చేశాడు. కాంట్రాక్టర్​ బేరమాడితే రూ.30 వేలకు ఒప్పుకున్నాడు.  ఇందులో భాగంగా ఇప్పటికే రూ.25 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.5 వేల కోసం ఇబ్బంది పెట్టడంతో కాంట్రాక్టర్​ బాలనర్సింహ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జీడిమెట్ల వెన్నలగడ్డలోని డీఈ కార్యాలయంలో గురువారం రూ.5 వేలు  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. డీఈ ప్రసాద్ రావు​ను అరెస్టు చేశామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్​గూడ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

ఆర్సీపురంలో ఇన్​చార్జి వీఆర్వో..

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్​ఆఫీస్​​పై గురువారం ఏసీబీ అధికారులు రైడ్​చేసి వీఆర్వోను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామంలో మహ్మద్​ జాకీర్​ హుస్సేన్​ కుటుంబ సభ్యులకు కొంత పొలం ఉంది. దానికి సంబంధించిన కాస్రా పహానీ, ఆర్ఓఆర్​ల్యాండ్​ రికార్డులు కావాలంటూ గత నెల 30న జాకీర్​ హుస్సేన్​ తహసీల్దార్​ఆఫీసులో డీటీ గంగాధర్​ను కలిశాడు. డీటీ ల్యాండ్​ పేపర్లు పరిశీలించి రికార్డ్​ అసిస్టెంట్​గా ఉన్న వీఆర్వో వెంకటయ్య వద్దకు పంపాడు. జాకీర్​హుస్సేన్​ అడిగిన రికార్డులు ఇచ్చేందుకు వీఆర్వో రూ. 6 వేలు లంచం అడిగాడు. ఆ రోజే రూ. 2వేలు ఇచ్చిన హుస్సేన్​ను​ మిగతా డబ్బుల కోసం వీఆర్వో తరచూ డిమాండ్​ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద అంత డబ్బు లేదని రైతు చెప్పడంతో రూ. 2 వేలు తగ్గించి మిగతా డబ్బులు ఇవ్వాలని అన్నాడు. ఈ నెల 5న జాకీర్​ హుస్సేన్​ సంగారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వెంకటయ్యకు రూ. 2 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ రవికుమార్​ ఆధ్వర్యంలో వెంకటయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెంకటయ్య జహీరాబాద్​ వీఆర్వోగా కాగా ఆర్సీపురంలో డిప్యుటేషన్​పై ఉన్నాడు.