ఆస్తుల లెక్కలు చెప్పట్లే..ఈఎన్సీ మురళీధర్ రావును విచారిస్తున్న ఏసీబీ

ఆస్తుల లెక్కలు చెప్పట్లే..ఈఎన్సీ మురళీధర్ రావును విచారిస్తున్న ఏసీబీ
  • ఏ ప్రశ్న అడిగినా మౌనమే సమాధానం
  • 8 మంది బినామీలను గుర్తించిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌‌‌‌‌‌‌‌ (ఈఎన్సీ) మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఏసీబీ విచారణకు సహకరించడం లేదని తెలుస్తున్నది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నిస్తుంటే.. మౌనమే సమాధానంగా వస్తున్నదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావును ఈ నెల 15న ఏసీబీ అధికారులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో బుధవారం నుంచి ఆదివారం దాకా 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 

రెండో రోజు కస్టడీ విచారణలో భాగంగా గురువారం మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు సహా ఆస్తులు కొనుగోలు చేసిన వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, బినామీ పేర్లతో కూడబెట్టిన ఆస్తులపైనే ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇల్లు సహా 11 ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా విచారిస్తున్నారు. 

ఆయనతో పాటు కుటుంబ సభ్యుల ఇండ్లలో స్వాధీనం చేసుకున్న జహీరాబాద్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్ ప్రాజెక్ట్ సహా ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, లగ్జరీ ఫ్లాట్లు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కమర్షియల్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్సులు మొత్తం 22 ప్రార్టీస్‌‌‌‌‌‌‌‌, 3 కార్లకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు. ఆయా డాక్యుమెంట్లలో ఉన్న వారికి మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్నవి కాకుండా మరో 8 మంది పేర్లతో ఉన్న అనుమానిత డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరంతా మురళీధర్​రావు బినామీలుగా భావిస్తున్న అధికారులు, త్వరలోనే వారిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.