ఇంటి దొంగల పని పట్టిన ఏసీబీ

ఇంటి దొంగల పని పట్టిన ఏసీబీ

హైదరాబాద్, వెలుగు:అవినీతి వనంలోకి కొత్త  మొక్కలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలోని అవినీతి అధికారుల చిట్టాతో అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవినీతిని నిర్మూలించాల్సిన ఏసీబీలో పనిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. అవినీతి అధికారులను బయటపెట్టాల్సిన మాజీ ఏసీబీ సిబ్బందే అక్రమాలకు పాల్పడుతోంది. చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ ను బెదిరించి జులైలో ఏసీబీకి చిక్కిన మాజీ కానిస్టేబుల్ ఓంప్రకాశ్ తరహాలోనే మరో ఇద్దరు అవినీతి ఖాకీలు మంగళవారం ఏసీబీకి దొరికారు. షామీర్ పేట్ సబ్ రిజిస్ట్రార్ శేషగిరి చంద్ ను బెదిరించి పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.18వేల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. గతంలో ఏసీబీలో పనిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్స్ వివరాలను ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావు వెల్లడించారు.

కార్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి

మడతల సుధాకర్ రెడ్డి (పీసీ 2183) 2016 వరకు ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ లో కానిస్టేబుల్ గా పనిచేశాడు. 10 ఏళ్ల పాటు దీర్ఘకాలంగా ఏసీబీలో  కొనసాగిన సుధాకర్ రెడ్డి అవినీతి అధికారులను ట్రాప్ చేయడంలో ఎక్స్ పర్ట్. తమ వద్దకు వచ్చే బాధితులతో పాటు అవినీతి అధికారుల చిట్టాతో  అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 2016 తరువాత సుధాకర్ రెడ్డి ఏసీబీ నుంచి బదిలీపై వెళ్లాడు. ప్రస్తుతం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ లో హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. తనకు తాను ఏసీబీ హెడ్ కానిస్టేబుల్ గా చెలామణి అయ్యాడు. తన దగ్గరున్న సమాచారంతో గత నెల 5న శామీర్ పేట్ సబ్ రిజిస్టార్ శేషగిరి చంద్ ను బెదిరించాడు. శేషగిరి చంద్ పై ఏసీబీకి ఫిర్యాదులు అందాయని దర్యాప్తు జరుగుతోందని చెప్పాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి కేసుల నుంచి తప్పిస్తానని నమ్మించాడు. అందుకు గాను మొదటి విడతగా రూ.8వేలు వసూలు చేశాడు.

సీఐడీ కానిస్టేబుల్ గుత్త యాదగిరి రెడ్డి

ఇదే విషయం తనతో కలిసి ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన గుత్త యాదగిరి రెడ్డి( పీసీ 668)కి సుధాకర్ రెడ్డి చెప్పాడు. యాదగిరి రెడ్డి 2015 వరకు ఏసీబీలో కానిస్టేబుల్ గా పనిచేశాడు. 15 ఏండ్ల పాటు కొనసాగిన యాదగిరి రెడ్డి  అనేక బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. 2015 తరువాత ఏసీబీ నుంచి బదిలీపై సీఐడీకి వెళ్లాడు. సీఐడీలో కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తూనే తనకు తాను ఏసీబీ కానిస్టేబుల్ గా చెలామణి అయ్యాడు. తన దగ్గరున్న సమాచారంతో పాటు సుధాకర్ రెడ్డి చెప్పిన విధంగా గత నెల 14న శామీర్ పేట్ సబ్ రిజిస్ర్టార్ శేషగిరి చంద్ ను బెదిరించాడు. మొదటి విడతగా రూ.10వేలు వసూలు చేశాడు. ఇలా వరుస బెదిరింపులకు పాల్పడుతున్న సుధాకర్ రెడ్డి,యాదగిరి రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. సబ్ రిజిస్టార్ శేషగిరి రావు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం నిఘా పెట్టింది. బోడుప్పల్, ఫీర్జాదిగూడలో సుధాకర్ రెడ్డి,యాదగిరి రెడ్డిను అదుపులోకి తీసుకుంది. వసూలు చేసి రూ.18వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించింది.