వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రర్ గా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తాండూరు ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తనకు చెందిన భూమిని 11 డాక్యుమెంట్లుగా చేసి కుటుంబ సభ్యులతో పాటు విక్రయదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించారు.
ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రర్ గా పనిచేస్తున్న సాయికుమార్(జూనియర్ అసిస్టెంట్) డాక్యుమెంట్లు సరిగ్గాలేవని వంకలు పెడుతూ నిరాకరించారు. కార్యాలయం ఎదుట ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న అశోక్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయిలు సదరు వ్యాపారి రిజిస్ట్రేషన్ పని చేయిస్తామని ఒప్పందం చేసుకున్నారు.
ఒక్కో డాక్యుమెంట్ కు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్లు వివరించారు. చివరికి ఒక్కో డాక్యుమెంట్ కు రూ.1,500 చొప్పున రూ.16,500కు బేరం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బృందం ట్రాప్ చేశారు. బుధవారం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి డాక్యుమెంట్ రైటర్లు అశోక్, సాయి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ అనంతరం డాక్యుమెంట్ రైటర్లు అశోక్, సాయిని కూడా అరెస్టు చేశారు.
