ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్సై

ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్సై
  • ..స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇచ్చేందుకు రూ. 40 వేలు డిమాండ్‌‌

మణుగూరు, వెలుగు : స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన మణుగూరు ఎస్సైని ఏసీబీ ఆఫీసర్లు శుక్రవారం అరెస్ట్‌‌ చేశారు. ఏసీబీ ఖమ్మం ఇన్‌‌చార్జి డీఎస్పీ విజయ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మణుగూరులో రెండు కార్లను లీజుకు తీసుకొని తిరిగి యజమానులకు అప్పగించలేదు. దీంతో కారు ఓనర్లు ఫిర్యాదు చేయడంతో ఇటీవల మణుగూరు పోలీస్‌‌స్టేషన్‌‌లో ఇద్దరిపై దొంగతనం కేసు నమోదు అయింది. 

ఈ కేసులో స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇవ్వాలని సదరు వ్యక్తులు ఎస్సై బత్తిన రంజిత్‌‌ను కోరడంతో రూ. 40 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. ఎస్సై డబ్బులు అడిగిన విషయాన్ని రికార్డు చేసిన వారు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఆడియో ఆధారంగా ఎంక్వైరీ చేసిన ఏసీబీ ఆఫీసర్లు శుక్రవారం స్టేషన్‌‌పై దాడి చేసి ఎస్సై రంజిత్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శేఖర్‌‌, కృష్ణ పాల్గొన్నారు.

విద్యుత్​ కనెక్షన్​ మార్చేందుకు లంచం డిమాండ్

మాదాపూర్, వెలుగు: ఇంటి విద్యుత్ కనెక్షన్ మార్చేందుకు లంచం తీసుకుంటూ ఓ లైన్​మెన్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ డివిజన్ లో వసంత్ నగర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ కు స్థానికుడైన ఓ వ్యక్తి తన ఇంటి విద్యుత్​కనెక్షన్​ను 5 కేవీ నుంచి 11 కేవీకి మార్చేందుకు అర్జీ పెట్టుకున్నాడు.

 దీనికి లైన్​మెన్​రూ.30 వేలు డిమాండ్ చేయగా.. రూ.11 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం లైన్ మెన్ శ్రీకాంత్ గౌడ్​బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.  లైన్​మెన్​ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.