
జగిత్యాల జిల్లా పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ( జులై 30 ) నిర్వహించిన ఈ సోదాల్లో జగిత్యాల క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనిల్ ఏసీబీ అధికారులకు రు ఎడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కోసం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు అనిల్. నాలుగేళ్లుగా క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్న కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ దగ్గర అనిల్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు అధికారులు.
కాంట్రాక్టర్ వెంకటేష్ గత నాలుగేళ్లుగా ఎల్లమ్మ ఆలయం పనులు రూ.13.80 లక్షలు, ఆర్డీవో ఆఫీస్ పనులు రూ.4.50 లక్షలు, కమ్యూనిటీ హాల్ పనులు రూ. 5 లక్షలు పూర్తి చేసి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట కోసం తిరుగుతున్నానని తెలిపాడు. నాలుగు సార్లు ఎంబీ రికార్డులు తిరస్కరించడంతో పాటు రూ.18 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపాడు బాధితుడు.
నాలుగేళ్లుగా క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్న తనకు సర్టిఫికెట్ ఇవ్వకపోగా లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. అధికారుల సూచన మేరకు మంగళవారం రూ. 3 వేలు, బుధవారం రూ. 7 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనిల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.