హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకుల హాస్టల్స్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. కొన్ని రోజులుగా వెల్ఫేర్ హాస్టల్స్ తో పాటు, గురుకుల హాస్టల్స్ లో ఫుడ్ సరిగా లేకపోవటంతో స్టూడెంట్స్ అనారోగ్యానికి గురికావటం, పలువురు మరణించడం, కిచెన్, త్రాగునీటి సౌలత్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టి, శానిటరీ ఇన్స్ పెక్టర్లతో మొత్తం 10 మంది అధికారులతో కలిసి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్టల్స్ లో వార్డెన్ల దగ్గర రిజిస్టర్లు, కిచెన్ కు సరఫరా చేసే కూరగాయలు, నూనె వంటి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 10 హాస్టల్స్ లో సోదాలు చేపట్టామని, సోదాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూమ్స్ క్లీన్ గా లేవని అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ మెను పాటించటం లేదని, రూమ్స్ లో వెలుతురు లేదని, స్టూడెంట్స్ కు గుడ్డు, పాలు ఇవ్వటం లేదని అధికారులు గుర్తించారు. వార్డెన్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా వారానికి, నెలకు ఒకసారి వస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడి అయిందన్నారు. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, తాగునీటి సదుపాయం సక్రమంగా లేనట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.
క్వాలిటీ లేని ఫుడ్ పిల్లలకు వడ్డిస్తున్నట్టు గుర్తించారు. సరైన రిజిస్టర్లు మెయింటైన్ చేయటం లేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన వాటిలో హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ హాస్టల్, మేడిపల్లిలో బీసీ హాస్టల్, మహబూబ్ నగర్ కోయల్ కొండలోని బీసీ హాస్టల్, నల్గొండ జిల్లా తిప్పర్తిలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంచిర్యాల ఎస్టీ బాయ్స్ హాస్టల్, సిరిసిల్లలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్, జనగామలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్, కొత్తగూడెం జిల్లాలో ఎస్టీ బాయ్స్ హాస్టల్, సిద్దిపేట జిల్లాలోని బీసీ బాయ్స్ హాస్టల్, నిజామాబాద్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి.
