
హైదరాబాద్, వెలుగు: హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే రెండు కార్లను ఓ బిల్డర్, మరో వ్యక్తి.. శివ బాలకృష్ణకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఆ కార్లు ఎందుకు కొన్నారు.. కొనుగోలు చేయడానికి డబ్బెక్కడిది.. వాటిని ఎవరు, ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారనే కోణంలో ఏసీబీ ఆధారాలు సేకరిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి ఆయనను తీసుకొని, మాసబ్ ట్యాంక్‌లోని రెరా ఆఫీస్‌కు వెళ్లారు.
శివబాలకృష్ణ క్యాబిన్‌లో సోదాలు జరిపి, కోటి రూపాయల విలువ చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ రీజనల్ ఆఫీస్‌కు తీసుకెళ్లి, విచారించారు. గతేడాది రెండు హోండా సిటీ కార్లను బిల్డర్, మరో వ్యక్తి కొనుగోలు చేసి శివ బాలకృష్ణకు ఇచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఆ కార్లు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వారితో బాలకృష్ణకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే వివరాలను ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ రెండు కార్లతో పాటు పలు బ్యాంకు అకౌంట్లు, లాకర్లు సైతం బినామీల పేరిట శివ బాలకృష్ణ నిర్వహిస్తున్నారని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు.