V6 News

తెలంగాణ మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సోదాలు..అవినీతి భాగోతం బట్టబయలు

తెలంగాణ  మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సోదాలు..అవినీతి భాగోతం బట్టబయలు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకేసారి 13 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల చిట్టా చూసి అధికారులు విస్తుపోయారు.ముఖ్యంగా అల్వాల్‌లోని మీ సేవా కేంద్రంలో ఖాళీ అటెస్టెడ్ సర్టిఫికెట్లు, ముందస్తుగా సంతకాలు చేసిన నోటరీ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల తయారీకి ఇక్కడ భారీ స్కెచ్ వేసినట్లు తేలింది. ఇక సరూర్ నగర్‌లో అయితే ఒకే కేంద్రంలో డబుల్ లాగిన్ ఐడీలు వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ కూడా భారీగా బ్లాంక్ నోటరీ పేపర్లు బయటపడ్డాయి.

ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. మధ్యవర్తులు, అధికారుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్స్ బయటపడటం. లంచాల వ్యవహారం అంతా యూపీఐ లావాదేవీల ద్వారా సాగుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. తార్నాకలో నోటరీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే.. ఖమ్మం కేంద్రంలో ఏకంగా అనధికార వ్యక్తులే ప్రభుత్వ సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

►ALSO READ | నిప్పులు కక్కుతోన్న సూర్యుడు.. ఈ 20 జిల్లాల వాళ్లు జాగ్రత్త

మరోవైపు సంగారెడ్డిలో స్టాంప్ పేపర్ల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని తేలింది. సూర్యాపేటలో తనిఖీలు చేయగా.. ఇతర కేంద్రాలకు సంబంధించిన సర్టిఫికెట్లు అక్కడ దొరికాయి. అంతేకాదు ప్రజలకు అందజేయాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను డెలివరీ చేయకుండా తమ వద్దే ఉంచుకుని వేధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్న తీరు ఈ దాడుల్లో బయటపడింది.