చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. హన్వాడలో ఘటన

చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. హన్వాడలో ఘటన

హన్వాడ, వెలుగు:  మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోతున్న ఓ యువకుడిని హన్వాడ పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు. హన్వాడ మండల కేంద్రానికి చెందిన ఎర్రగొల్ల రవికుమార్ (30) బుధవారం ఉదయం మద్యం తాగిన అనంతరం కాలకృత్యాల కోసం స్థానిక చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే హన్వాడ ఎస్సై వెంకటేష్‌‌కు సమాచారం అందించారు.  

సీఎం బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై తక్షణమే స్పందించి కానిస్టేబుల్ భాస్కర్‌‌ను ఘటనా స్థలానికి పంపించారు. కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకొని కర్ర సహాయంతో మునిగిపోతున్న రవికుమార్‌‌ను ప్రాణాలతో బయటకు లాగాడు. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు.