జలమండలి GM కుమార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు.. రూ. 50 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు.. బంగారం ఎన్ని కిలోలు ఉందంటే..

జలమండలి GM కుమార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు.. రూ. 50 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు.. బంగారం ఎన్ని కిలోలు ఉందంటే..

హైదరాబాద్: రెడ్ హిల్స్ HMWSS&SB ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) ఎస్.ఏ.ఎల్ కుమార్‌పై తెలంగాణ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఎస్.ఏ.ఎల్ కుమార్‌ పూర్తి పేరు సగ్గం అనంత లక్ష్మీ కుమార్. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ACB తనిఖీల్లో గుర్తించింది. అవినీతి, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు తెలిసింది. 

అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదైంది. మే19, 2026న అతని ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 8 ప్రాంతాల్లో ACB సోదాలు చేసింది.

నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, ఒక ఇల్లు గుర్తించారు. సోదాల్లో సుమారు రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. సుమారు 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

►ALSO READ | హైదరాబాద్ పబ్లిక్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

ఒక మారుతి రిట్జ్ కారు, ఒక బజాజ్ బైక్ గుర్తించారు. హైదరాబాద్ జలమండలి విభాగంలో జనరల్ మేనేజర్గా ఉన్న సగ్గం అనంత లక్ష్మీ కుమార్ మొత్తం అక్రమాస్తుల విలువ రూ.58 కోట్ల 85 లక్షల 5 వేల 490 రూపాయలకు పైనే ఉందని అధికారులు అంచనా వేశారు. 

మార్కెట్ విలువ, డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. లంచం డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదుల కోసం ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 సంప్రదించాలని ఏసీబీ సూచించింది.