సిద్దిపేట అడిషనల్​ డీసీపీపై ఏసీబీ దాడులు

సిద్దిపేట అడిషనల్​ డీసీపీపై ఏసీబీ దాడులు

సిద్దిపేట, వెలుగుఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో సిద్దిపేట అడిషనల్‌ డీసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో సిద్దిపేటలోని ఆయన ఇల్లు, ఆఫీసు, హైదరాబాద్, మహబూబ్​నగర్, షాద్​నగర్, అయ్యవారిపల్లె తదితర ప్రాంతాల్లోని నరసింహారెడ్డి బంధువులు, మిత్రుల ఇండ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా కోట్ల విలువైన భూములు, స్థలాలు, ఇతర ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌‌ షేక్‌‌పేటలోని ఆదిత్య టవర్స్ లో ఉన్న 505 నంబర్​ ఫ్లాట్​లో ఏసీబీ టీమ్​ తనిఖీలు చేసింది. నరసింహారెడ్డితో కలిసి రియల్‌ ‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిద్దిపేట వన్‌‌ టౌన్‌ ‌హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ సాంబరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. నరసింహారెడ్డిని, సాంబరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నరసింహారెడ్డి అవినీతి, అక్రమ మార్గాల్లో భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించినట్టుగా గుర్తించామని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని తెలిపారు.

కానిస్టేబుళ్లతో కలిసి దందాలు!

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన నరసింహారెడ్డి 1992లో పోలీసు శాఖలో ఎస్సైగా చేరారు. మొదట్లో ఇంటెలిజెన్స్ విభాగంలో ఎక్కువ కాలం పనిచేశారు. తర్వాత లా అండ్‌ ‌ఆర్డర్ విభాగంలోకి వచ్చారు. 2016లో సిద్దిపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొత్త జిల్లాలు, కమిషనరేట్ల ఏర్పాటు నేపథ్యంలో 2018లో అడిషనల్‌ డీసీపీగా ప్రమోషన్‌‌ పొందారు. మూడేండ్ల నుంచి సిద్దిపేటలో పనిచేస్తున్న నరసింహారెడ్డి కొందరు కానిస్టేబుళ్లతో కలిసి ల్యాండ్‌ ‌సెటిల్‌‌మెంట్లు, రియల్‌ ‌ఎస్టేట్ దందాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్​ 70లో 8.3 ఎకరాల వ్యవసాయ భూమిని కొని, తన బిడ్డ పేరిట రిజిస్ట్రేషన్‌ ‌చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆ వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది. సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో మరిన్ని చోట్ల కూడా నరసింహారెడ్డి వ్యవసాయ భూములు కొన్నట్టుగా గుర్తించారని సమాచారం.