- బార్డర్లలో చెక్‌పోస్టులు ఎత్తేసినా ఆగని వసూళ్లు
- ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా
- ఏసీబీ వరుస దాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు
- అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు
- వీఆర్ఎస్ వైపు మొగ్గు
హైదరాబాద్, వెలుగు:
రవాణా శాఖపై ఏసీబీ వరుస దాడులతో ఆ శాఖ ఆఫీసర్లలో వణుకు మొదలైంది. ఖమ్మంలోని ఆర్టీఏ ఆఫీసుపై సోమవారం దాడి చేసిన ఏసీబీ అధికారులు.. అక్కడి ఎంవీఐ, ఏఎంవీఐపై కేసులు నమోదు చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ నాయక్, ఆయన బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసి భారీగా నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రవాణాశాఖలో పని చేస్తున్న కొందరు అధికారుల అవినీతి, అక్రమాలపై ఏసీబీకి వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత అక్టోబర్ 18, 19వ తేదీల్లో బార్డర్ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
-ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 12 చెక్ పోస్టుల్లో రూ.4.18 లక్షలు సీజ్ చేశారు. ఇది జరిగిన 2 రోజులకే 15 బార్డర్ చెక్‌పోస్టులను ఎత్తేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో అక్రమాలకు అడ్డుకట్టపడిందని భావించింది. కానీ.. రవాణా శాఖ అధికారుల తీరు మారలేదు. చెక్‌పోస్టుల చుట్టుపక్కలే మాటేసి.. వసూళ్లకు పాల్పడటం ప్రారంభించారు. ఏజెంట్లతో దందా కొనసాగించారు.
ఆధారాలతో సీఎంవోకు నివేదికలు
రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 100 మందికి పైగా అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ.. ఆయా అధికారులపై ఆధారాలతో సహా నివేదికలు రెడీ చేసి సీఎంవోకు అందజేసింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగినట్లు తెలుస్తున్నది. సోమవారం ఖమ్మంలో, మంగళవారం మహబూబ్ నగర్ లోని రవాణా శాఖ అధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి.
ఈ మధ్య కాలంలో భువనగిరి ఎంవీఐ సురేందర్ రెడ్డిపై, వరంగల్ డీటీసీగా ఉన్న శ్రీనివాస్ పై కూడా ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆర్మూర్ ఎంవీఐ వివేక్, జగిత్యాల డీటీవో భద్రు నాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రవాణా శాఖలో గుట్టుగా సాగిన అక్రమ దందాకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్‌పెట్టడం వల్లే ఈ రెండేండ్ల కాలంలో రవాణా శాఖ అధికారులపై పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూ ఏసీబీకి చిక్కితే ఎక్కడ అక్రమాస్తులు బయటపడ్తాయోననే భయంతో చాలామంది అధికారులు వీఆర్ఎస్ తీసుకుంటున్నారు.
నెల రోజుల కింద కామారెడ్డి డీటీవో శ్రీనివాస్ రెడ్డి ఇలాగే వీఆర్ఎస్ తీసుకోవడంపై రవాణాశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జేటీసీ పాపారావు, ఎంవీఐ చక్రవర్తి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. పాపారావు.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రవాణా శాఖలో కీలకంగా వ్యవహరించారు. తాజాగా పట్టుబడిన డీటీసీ కిషన్ నాయక్ ఈయనకు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఇక ఇప్పుడు జరుగుతున్న ఏసీబీ దాడులతో మరో 3, 6 నెలల్లో రిటైర్మెంట్ కానున్న పలువురు అధికారులతో పాటు ఏడాది సర్వీసు ఉన్న ఆఫీసర్లు సైతం వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు రవాణా శాఖలో చర్చ జరుగుతున్నది.
