కామారెడ్డి కలెక్టరేట్లోని సివిల్ సప్లై ఆఫీసులో ఏసీబీ సోదాలు

 కామారెడ్డి కలెక్టరేట్లోని సివిల్ సప్లై ఆఫీసులో ఏసీబీ సోదాలు
  •     వడ్ల కొనుగోళ్లు,  రైసుమిల్లులకు కేటాయింపు, సీఎంఆర్ రికార్డుల పరిశీలన

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లోని సివిల్​ సప్లై​ ఆఫీస్​లో  శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.  మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్ ఆధ్వర్యంలో సీఐలు వేణు, నగేశ్, రమేశ్​లతో పాటు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.   డీఎస్​వో, డీఎం ఆఫీస్​ల్లోని రికార్డులు పరిశీలించారు. 

గత కొన్నేళ్లుగా  బియ్యం కొనుగోళ్లు,  రైసు మిల్లర్లకు బియ్యం కేటాయింపులు,  సీఎంఆర్ ( కస్టమ్​ మిల్లింగ్​ రైస్​) అప్పగింతకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.  ఏ ఏడాది ఎంత మేర వడ్ల కొనుగోలు చేశారు, ఏ రైస్​ మిల్లుకు ఎంత కేటాయింపు,  తిరిగి ఇచ్చిన కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ ఎంత అనే దానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. 

  ప్రధానంగా  వడ్లు  కేటాయించిన తర్వాత సీఎంఆర్  ఇవ్వని రైస్​ మిల్లులు ఎన్ని, ఎంత మేర సీఎంఆర్​ బకాయి ఉంది,  బకాయిలు ఉన్న రైస్​మిల్లులకు మళ్లీ వడ్ల కేటాయింపు జరిగిందా..? అనే అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.  ఏసీబీ అధికారులు సివిల్​ సప్లై​ ఆఫీస్​కు చేరుకున్న తర్వాత అందులోకి ఇతరులను ఏవరిని రానివ్వలేదు.   

2014 నుంచి ఇప్పటి వరకు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. కలెక్టరేట్​లోని సివిల్​ సప్లై​ ఆఫీస్​లో ఏసీబీ సోదాలు చేయటంతో మిగతా శాఖాల్లో  కలకలం రేగింది.   తనిఖీలకు సంబందించిన వివరాలపై ఏసీబీ డీఎస్పీని సంప్రదించగా పరిశీలన పూర్తి అయిన తర్వాత వివరాలు అందజేస్తామని తెలిపారు. 

ప్రశంసా పత్రాలు అందుకున్న మరుసటి రోజే.. 

 వడ్ల కొనుగోళ్లకు సంబంధించి మద్దతు ధర చెల్లింపుల విభాగంలో  స్టేట్​ లో ఫస్ట్ ప్లేస్​లో  కామారెడ్డి జిల్లా నిలవగా శుక్రవారం  జిల్లాకు చెందిన డీఎస్​వో వెంకటేశ్వర్​రావు, డీఎం  శ్రీకాంత్ రాష్ర్ట పౌర సరాఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చేతుల మీదుగా  ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఏసీబీ అధికారులు  మరుసటి రోజే తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది.