
వరంగల్, వెలుగు : బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకున్న ఓ సైట్ ఇంజినీర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన మురారిశెట్టి అంజయ్య స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులు పూర్తి చేశాడు.
దీనికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని జనగామ జిల్లా డీఈవో ఆఫీస్‌లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్‌ప్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సామల రమేశ్‌ను కలిశాడు. బిల్లు మంజూరు చేసేందుకు అతడు రూ. 18 వేలు డిమాండ్ చేయడంతో.. అంజయ్య రూ. 10 వేలు ఇచ్చాడు.
మిగతా రూ. 8 వేలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని రమేశ్ చెప్పడంతో అంజయ్య ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు అంజయ్య గురువారం హనుమకొండలో ఉన్న రమేశ్‌ను కలిసి రూ. 8 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.