జూబ్లీహిల్స్, వెలుగు : జీహెచ్ ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ. లక్ష లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. ఆమె ఖైరతాబాద్ జోన్ బోరబండ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ (ఏఓ)గా పనిచేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం జూనియర్ అసిస్టెంట్‌ను శ్రీలతను కలువగా.. పని పూర్తి చేసేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
వారి సూచన మేరకు సదరు వ్యక్తి సోమవారం యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద గల రత్నదీప్ సమీపంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీలతను కలిసి మొదటి విడతగా రూ. లక్ష ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు శ్రీలతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుచగా.. జ్యుడిషియల్ రిమాండ్ విదించినట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.
