- ఫ్లెక్సీ కొట్టించి, పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేసిన రైతులు
శాయంపేట, వెలుగు: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సస్పెన్షన్ తో గ్రీన్‌ఫీల్డ్‌హైవే బాధిత రైతులు ఫ్లెక్సీ కొట్టించి, పటాకులు కాల్చారు. అడిషనల్ కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
అడిషనల్ కలెక్టర్వెంకట్రెడ్డి ఇన్ చార్జ్ డీఈఓగా ఓ స్కూల్నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో అతనితో ఇబ్బందులు పడిన దామెర, శాయంపేట మండలాలకు చెందిన గ్రీన్‌ఫీల్డ్‌హైవే బాధిత రైతులు శనివారం కలెక్టర్ఆఫీసు ఎదుట ఫ్లెక్సీని కట్టి.. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అడిషనల్కలెక్టర్వెంకట్రెడ్డి రెండేండ్లుగా భూ నిర్వాసితులకు సరైన ధర ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోటి పలికే భూములకు కేవలం రూ.3లక్షలే ఇస్తామంటూ నోటీసులు సైతం ఇచ్చారన్నారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే తమ ముఖాలపై కొట్టి, ఇంతకంటే ఎక్కువ ఎలా వస్తుందంటూ అవమానపరిచాడని గుర్తు చేసుకుని వాపోయారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చెప్పించినా అతనిలో ఎలాంటి మార్పురాలేదన్నారు. అడిషనల్కలెక్టర్వెంకట్రెడ్డి సరైన రిపోర్టు పంపి ఉంటే తమకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేదన్నారు. అలాంటి అవినీతి అధికారిని ఉరితీస్తేనే .. మరో అధికారి లంచం మాటెత్తరని రైతులు ఆవేదనతో చెప్పారు.
